భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నట్లు సూచిస్తూ ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో అక్టోబర్ 14 నాటికి నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.13.38 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 13.21 శాతం అధికమని ఆదాయ పన్ను శాఖ నేడు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కార్పొరేట్ పన్ను, నాన్-కార్పొరేట్ పన్ను (వ్యక్తిగత ఆదాయ పన్ను), 'సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్' (ఎస్‌టీటీ) వసూళ్లు పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

రిఫండ్‌లను సర్దుబాటు చేయకముందు, స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 14.89 శాతం పెరిగి రూ.16.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ వసూళ్లు రూ.13.95 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసిన రిఫండ్‌లు కూడా గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే రిఫండ్‌లు 24.22 శాతం పెరిగి రూ.2.65 లక్షల కోట్లకు చేరినట్లు అధికారిక డేటా వెల్లడించింది.

విభాగాల వారీగా పరిశీలిస్తే.. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.4.97 లక్షల కోట్ల నుంచి రూ.5.99 లక్షల కోట్లకు పెరిగాయి. వ్యక్తులు, ఇతర సంస్థలు చెల్లించే నాన్-కార్పొరేట్ పన్నుల నికర వసూళ్లు రూ.6.54 లక్షల కోట్ల నుంచి రూ.6.92 లక్షల కోట్లకు చేరాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లావాదేవీలపై విధించే ఎస్‌టీటీ నికర వసూళ్లు రూ.30,901 కోట్ల నుంచి రూ.46,840 కోట్లకు పెరిగి బలమైన వృద్ధిని నమోదు చేశాయి.

స్థూల వసూళ్లలోనూ ఇదే ధోరణి కనిపించింది. గ్రాస్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్లు రూ.6.44 లక్షల కోట్ల నుంచి రూ.7.53 లక్షల కోట్లకు, గ్రాస్ నాన్-కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ.7.20 లక్షల కోట్ల నుంచి రూ.8.03 లక్షల కోట్లకు పెరిగాయి. కంపెనీలు, వ్యక్తులు, ఇతర సంస్థల నుంచి వసూలు చేసే పన్నులన్నీ ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది.