అమెరికాలో ఒక ప్రవాస భారతీయుడు దారుణానికి ఒడిగట్టాడు. తనతో తిరిగి కలిసి జీవించేందుకు నిరాకరించిందన్న కోపంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నేరం నుంచి తప్పించుకునేందుకు భారత్‌కు పారిపోవాలని ప్రయత్నించి, ఎయిర్‌పోర్టులో పోలీసులకు చిక్కాడు. షికాగోలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, భారత సంతతికి చెందిన అంకుర్ పటేల్ (31), అతని భార్య కొంతకాలంగా షికాగోలో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. గత మే నెల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె ఒకసారి తిరిగి వచ్చినా, మళ్లీ విభేదాలు రావడంతో వేరే నగరానికి వెళ్లిపోయింది. లూసియానాలో తన మాజీ సహోద్యోగితో కొత్త జీవితం ప్రారంభించింది. అయితే, వారి కూతురిని మాత్రం అంకుర్ పటేల్ తన వద్దే ఉంచుకున్నాడు.

భార్య వేరొకరితో ఉండటాన్ని సహించలేని అంకుర్, ఆమెకు, ఆమె కొత్త భాగస్వామికి బెదిరింపులు పంపాడు. భార్యకు తెలియకుండా కూతురిని భారత్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు పంపించేశాడు. ఆ తర్వాత, కూతురిని చూపిస్తానని నమ్మించి భార్యను షికాగోలోని తన అపార్ట్‌మెంట్‌కు రప్పించాడు. ఆమె తన భాగస్వామితో కలిసి కారులో రాగా, అతను బయటే వేచి ఉన్నాడు.

అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన ఆమెకు కూతురు కనిపించలేదు. ఈ క్రమంలో, తనతో కలిసి జీవించాలని అంకుర్ కోరగా, ఆమె అందుకు నిరాకరించింది. తన కొత్త భాగస్వామితోనే ఉంటానని స్పష్టం చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అంకుర్, కత్తితో ఆమె మెడపై పొడిచి హత్య చేశాడు. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భాగస్వామి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరోవైపు, అంకుర్ స్నేహితులు అతని అపార్ట్‌మెంట్‌కు వచ్చి చూడగా, వాషింగ్ మెషీన్ వద్ద ఆమె మృతదేహం కనిపించింది.

హత్య అనంతరం అంకుర్ నేరుగా షికాగో ఓ'హేర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి భారత్‌కు టికెట్ కొనేందుకు ప్రయత్నించాడు. కానీ కౌంటర్ మూసి ఉండటంతో, సమీపంలోని హోటల్‌లో బస చేసి, మరుసటి రోజు టికెట్ కొనుగోలు చేశాడు. అయితే, అప్పటికే అప్రమత్తమైన పోలీసులు అతడిని విమానం ఎక్కేలోపే అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో, ఆమె తనను నిరాకరించడంతోనే "పని పూర్తి చేశానని" అంగీకరించాడు. పోస్టుమార్టం నివేదికలో, ఆమె శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె పోరాడిందని, ఈ క్రమంలోనూ మరికొన్ని గాయాలయ్యాయని తేలింది. పోలీసులు అంకుర్ పటేల్‌పై ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.