పానీపూరి ఇప్పిస్తానని ఆశపెట్టి.. బాలికపై అత్యాచారం

  • హైదరాబాద్, ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • అరెస్ట్ చేసి రిమాండుకు పంపిన పోలీసులు
ఎనిమిదేళ్ల బాలికకు పానీపూరి, సమోసా ఇప్పిస్తానని ఆశ చూపిన ఓ వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్, ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బీకేగూడకు చెందిన దంపతులు చెత్త ఏరుకుని జీవిస్తుంటారు.

బుధవారం మధ్యాహ్నం వీరి మూడో కుమార్తె తల్లి వద్దకు వచ్చి ఓ అంకుల్ పానీపూరి, సమోసాలు ఇప్పిస్తానని పిలుస్తున్నాడని, వెళ్తానని చెప్పింది. దీంతో కోప్పడిన తల్లి ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పి భోజనం పెట్టి నిద్రపుచ్చింది. ఆ తర్వాత కాసేపటికే కుమార్తె కనిపించకపోవడంతో కంగారుపడిన ఆమె.. వెతుక్కుంటూ సమీపంలోని పార్క్‌కు వెళ్లింది. అక్కడి సెక్యూరిటీ గార్డు వద్ద పాప గురించి ఆరాతీసింది.

ఓ వ్యక్తి పాప, బాబుతో పార్క్‌లోని బాత్రూం వద్ద కనిపించాడని, తానే అతడిని అక్కడి నుంచి పంపేశానని సమాధానమిచ్చాడు. దీంతో వారిని వెతుక్కుంటూ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోకి వచ్చింది. అక్కడ నిందితుడు నాగరాజు.. బాబు, పాపతో కనిపించాడు. వెంటనే అతడి చెర నుంచి కుమార్తెను విడిపించిన తల్లి.. ఏం జరిగిందని కుమార్తెను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సమోసా, పానీపూరి ఇప్పిస్తానని చెప్పి బాత్రూములోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నాగరాజు (30)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


More Telugu News