ట్రంప్, సీఎన్​ఎన్​ విలేకరి మధ్య మాటల యుద్ధం!

  • ఢిల్లీలో ప్రెస్ మీట్ సందర్భంగా పరస్పర విమర్శలు
  • అమెరికా అంశాలను ప్రస్తావించిన సీఎన్ఎన్ విలేకరి జిమ్ అకోస్టా
  • తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ మండిపడ్డ ట్రంప్
ఢిల్లీలో ప్రెస్ మీట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సీఎన్ఎన్ విలేకరి జిమ్ అకోస్టా మధ్య వాగ్వాదం జరిగింది. మీవి తప్పుడు వార్తలు అంటూ ట్రంప్ ఫైర్ అయితే.. మీది చెత్త రికార్డు అంటూ సీఎన్ఎన్ విలేకరి మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎన్ఎన్ నెట్ వర్క్ నిబద్ధతపై గతంలో ట్రంప్ ప్రశ్నలు లేవనెత్తడంతో విభేదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఢిల్లీలో మీటింగ్ సమయంలో అవి మరోసారి బయటపడ్డాయి.

ఎవరేమన్నారు?

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా సీఎన్ఎన్ విలేకరి జిమ్ అకోస్టా అమెరికా విషయాలను ప్రస్తావించారు. త్వరలో అమెరికాలో జరగబోయే ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని తిరస్కరిస్తానని ప్రతిజ్ఞ చేయగలరా? ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తిని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నాకు ఏ దేశం నుంచీ సహాయం అవసరం లేదు. నాకు ఏ దేశం కూడా అలాంటి సాయం ఇవ్వజూపలేదు. తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు సీఎన్ఎన్ ఇటీవల క్షమాపణ చెప్పాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.

మాది మెరుగైన రికార్డు.. కాదు చెత్త రికార్డు

ట్రంప్ సమాధానంపై స్పందించిన అకోస్టా.. ‘‘వాస్తవాలు ప్రసారం చేయడంలో సీఎన్ఎన్ మీకన్నా బాగుంటుంది, మాకు మంచి రికార్డు ఉంది” అని పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ ఆగ్రహంగా సమాధానమిచ్చారు. ‘‘మీ రికార్డు చాలా చెడ్డది. మీరు దానికి సిగ్గుపడాలి..” అని విమర్శించారు. దీంతో తానుగానీ, తమ సంస్థగానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదని జిమ్ అకోస్టా వ్యాఖ్యానించారు.

చాలా కాలంగా విభేదాలు

సీఎన్ఎన్ విలేకరి అకోస్టాకు, ట్రంప్ కు మధ్య ఇంతకు ముందే విభేదాలు ఉన్నాయి. ట్రంప్ సీఎన్ఎన్ ను తప్పుపట్టడం, దీనిపై అకోస్టా ఆయనను నిలదీయడం పలు మార్లు జరిగింది. 2018లో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో జరిగిన మీటింగ్ లో ట్రంప్ తో అకోస్టా వాగ్వాదానికి దిగారు. దాంతో ఆయన ప్రెస్ పాస్ ను రద్దు చేయగా.. సీఎన్ఎన్ కోర్టుకు వెళ్లడంతో తిరిగి ఇచ్చారు.


More Telugu News