ఐస్ క్రీమ్ ఎంగిలి చేశాడని నెల రోజుల జైలు శిక్ష వేశారు!
టెక్సాస్ లోని వాల్ మార్ట్ స్టోర్ లో ఘటన
ఐస్ క్రీమ్ ను ఎంగిలి చేసి తిరిగి ఫ్రిజ్ లో పెట్టేసిన యువకుడు
పైగా వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టింగ్
ఐస్ క్రీమ్ డబ్బాలన్నీ పారేసిన వాల్ మార్ట్ స్టోర్
అమెరికాలోని టెక్సాస్ లో షాపింగ్ మాల్ కు వెళ్లిన అండర్సన్ అనే యువకుడు సరదాకి ఓ పిచ్చి పని చేశాడు. ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్రీమ్ డబ్బా తీసి కొంత నాకాడు, వేళ్లతో ఇంకొంచెం తీసుకుని నాకాడు. తర్వాత ఆ ఐస్ క్రీమ్ డబ్బాకు మూత పెట్టి ఎప్పటిలా ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. ఇదంతా వీడియో తీసుకుని.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఫేస్ బుక్ లో అయితే ఏకంగా లక్షన్నర మంది ఆ వీడియోను చూశారు.
దెబ్బకి ఐస్ క్రీమ్ లన్నీ పడేసి..
అండర్సన్ చేసిన విషయం తెలిసిన వాల్ మార్ట్ స్టోర్ నిర్వాహకులు తల పట్టుకున్నారు. ఆ ఫ్రిడ్జ్ లలో ఉన్న ఐస్ క్రీమ్ డబ్బాలన్నింటినీ పడేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐస్ క్రీమ్ లు పడేయడం వల్ల ఒక లక్షా పదివేల రూపాయలు (1,565 డాలర్లు) నష్టం వచ్చిందని పేర్కొన్నారు. పోలీసులు అండర్సన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.
సరదానే కానీ.. ప్రజా ఆరోగ్య భద్రతకు ప్రమాదమంటూ..
అండర్సన్ చేసిన పని సరదాగానే కనిపించినా.. అది ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రమాదకరమని అధికారులు కోర్టుకు వివరించారు. ఈ వాదనను సమర్థించిన కోర్టు అండర్సన్ కు నెల రోజుల జైలు శిక్ష, వెయ్యి డాలర్లు (సుమారు రూ.70 వేలు) జరిమానా విధించింది.
ఆ ఐస్ క్రీం అతనే కొన్నాడు మరి
తాను ఎంగిలి చేసి పెట్టినట్టుగా వీడియో తీసిన తర్వాత ఆ ఐస్ క్రీమ్ ను తానే కొనుగోలు చేశానని, సరదాకే వీడియో సోషల్ మీడియాలో పెట్టానని అండర్సన్ చెప్పాడు. సీసీ కెమెరాల్లో చూడటంతో అండర్సన్ చెప్పింది నిజమేనని గుర్తించారు. కానీ ఆ వీడియో కారణంగా వ్యక్తమైన ఆందోళన, వాల్ మార్ట్ స్టోర్ కు జరిగిన నష్టం నేపథ్యంలో కోర్టు శిక్ష విధించింది. అతి ప్రవర్తన సరిగా లేదని పేర్కొంది.