ఇక మేము సాయం చేస్తాం: ఇండియాకు చైనా ఆఫర్

  • గతంలో వూహాన్ కు ఔషధాలు పంపిన ఇండియా
  • గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపిన చైనా ఎంబసీ
  • కరోనాపై పోరులో సహాయపడతామని హామీ
చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత, ఇండియా నుంచి ప్రత్యేక విమానంలో వైద్య పరికరాలు, మందులను పంపిన విషయాన్ని ప్రస్తావించిన చైనా, అందుకు కృతజ్ఞతలు చెబుతూనే, ఈ మహమ్మారిపై పోరులో ఇక భారత్ కు సాయం చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించింది.

ఈ మేరకు చైనా ఎంబసీ కౌన్సిలర్ జీ రాంగ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఇండియాకు సాయం చేసేందుకు చైనా సిద్ధంగా ఉంది. ఇండియాకు ఎటువంటి అవసరం వచ్చినా, చేతనైనంత సాయపడుతూ, మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. ప్రపంచం ఇప్పుడు కష్టకాలంలో ఉందని, ఈ వైరస్ పై పోరాడేందుకు సమాచార మార్పిడి, పరస్పర సహకారం కీలకమని ఆమె వ్యాఖ్యానించారు.

చైనాలో దాదాపు 81 వేల మంది వైరస్ బారిన పడగా, 3,200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెలారంభంలో చైనాకు ఇండియా నుంచి 15 టన్నుల వైద్య పరికరాలు వెళ్లాయి. మాస్క్ లు, గ్లవ్స్, అత్యవసర ఔషధాలను ఇండియా పంపింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన జీ రాంగ్, భారత ప్రజలు చైనాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా భారతీయులు ఈ వైరస్ పై విజయం సాధిస్తారన్న నమ్మకం తమకుందని అన్నారు.


More Telugu News