రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది!: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • నిన్నటి నుంచి రేషన్ కార్డుదారులకు  బియ్యం పంపిణీ  
  •  కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నాం
  • ప్రతి ప్రాంతంలో రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నాం
విజయవాడలో రేషన్ సరఫరా తీరును ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు నిత్యావసరాలపరంగా, ఇతర అంశాలలో ఇబ్బంది పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నామని, నిన్నటి నుంచి రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం చొప్పున, కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు రేషన్ తీసుకునేవిధంగా ఆదేశాలు ఇచ్చామని,  ప్రతి ప్రాంతంలో రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నామని, గతంలో ఐదు రైతు బజార్లు ఉంటే ఈ రోజు 45 రైతుబజార్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

వలంటీర్లను అవమానించే రీతిలో ట్వీట్లు చేస్తారా?

రాష్ట్ర ప్రజలు ‘కరోనా’తో పోరాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాత్రం హైదరాబాద్ లో కూర్చొని ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే.. వారిని అవమానించే రీతిలో ట్వీట్లు  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని  చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వెల్లంపల్లి సూచించారు. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రభుత్వాన్ని కించపరిచేలా చేయాలని చూడటం సరైన విధానం కాదని హితవు పలికారు. సీఎం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని, ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం, బ్రిటన్ లాంటి దేశాలు కూడా వలంటీర్లను  నియమిస్తున్నాయని చెప్పారు. కరోనా మహమ్మారి కట్టడికి  జగన్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.

నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి

విజయవాడలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయని, అనుమానితులందరినీ హోమ్ క్వారంటైన్లో ఉంచుతున్నామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక కరోనా బాధితుడు రికవరీ పొజిషన్లో ఉన్నాడని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.


More Telugu News