కరోనా సంక్షోభం: భారీస్థాయిలో వితరణ ప్రకటించిన షారుఖ్ ఖాన్

  • దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధింపు
  • పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం
  • డాక్టర్ల కోసం 50 వేల పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు
  • 5,500 మందికి నెలరోజుల పాటు ఆహారం
కరోనా మహమ్మారి శరవేగంతో పాకిపోతున్న నేపథ్యంలో ఓ వైపు నివారణ చర్యలు, మరోవైపు సహాయకచర్యలు సమాంతరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనాపై పోరుకు మద్దతిస్తూ భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పీఎం కేర్స్ ఫండ్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో వితరణ ప్రకటించారు. అయితే ఆ మొత్తం ఎంతన్నది తెలియరాలేదు.

అంతేకాకుండా, కరోనా రోగులకు సేవలు అందిస్తున్న డాక్టర్ల కోసం 50 వేల శరీర రక్షక వ్యవస్థలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. షారుఖ్ ఖాన్ కు చెందిన మీర్ ఫౌండేషన్, ఏక్ సాత్ అనే మరో సంస్థతో కలిసి ముంబయిలోని 5,500 మందికి నెలరోజుల పాటు ఆహార అవసరాలు తీర్చనుంది. నిత్యం హాస్పిటళ్లు, ఇతర ప్రాంతాల్లో 2 వేల మందికి సరిపడా ఆహారాన్ని కూడా పంపిణీ చేయనున్నారు. ముంబయిలోని 2,500 మంది కూలీలకు నెల రోజుల పాటు కనీస నిత్యావసరాలు సరఫరా చేయాలని నిర్ణయించారు.


More Telugu News