కరోనా ఉందని తెలిసినా ముగ్గురు బస్సెక్కారు... 'టీఎస్ 08 జడ్ 0229' శుక్రవారం మధ్యాహ్నం గం.3.30 సర్వీస్!

  • లాక్ డౌన్ లో ప్రజల అవసరార్థం బస్సులు
  • సర్వీసులు నడిపిస్తున్న టీఎస్ఆర్టీసీ
  • ఆదిలాబాద్ వెళ్లే బస్సెక్కిన కరోనా రోగులు
  • అందరూ టెస్ట్ కు రావాలన్న అధికారులు
కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ, ప్రజల అవసరాల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ఎంతో అత్యవసరమైతేనే ప్రజలు బస్సెక్కుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో బాధ్యతలేని కొందరి వల్ల వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతోంది. అటువంటిదే ఈ ఘటన. హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ అని తేలిన ముగ్గురు వ్యక్తులు ఆదిలాబాద్ కు బస్సులో ప్రయాణించారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు  'టీఎస్ 08 జడ్ 0229' సర్వీసులో వీరు వెళ్లారు.

సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్టాండు నుంచి బస్సు బయలుదేరగా, అంతకుముందే హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకుని పాజిటివ్ గా నిర్దారణ అయ్యారు. ఆపై బస్సులో శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ఆదిలాబాద్ చేరుకుని, అక్కడి రిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి, తాము పాజిటివ్ అని చెప్పి, చేర్చుకోవాలని వేడుకున్నారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన అధికారులు, వైద్య సిబ్బంది బస్ సర్వీస్ నంబర్ ను విడుదల చేసి, అందులో ప్రయాణించిన వారంతా కరోనా పరీక్షలకు సమీపంలోని కేంద్రాలను వెంటనే సంప్రదించాలని కోరారు.


More Telugu News