భారీ వర్షాల నేపథ్యంలో.. హైదరాబాదీలకు సీపీ అంజనీ కుమార్ హెచ్చరికలు!

  • మరో 72 గంటల పాటు వర్షాలు
  • భారీ వర్షం కురిసే అవకాశం
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న సీపీ
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ, హైదరాబాద్ లోని ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. వచ్చే 72 గంటల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్హెచ్ఓలు, ఏపీసీలను ఆదేశించిన ఆయన, నగర వ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించారు. ముఖ్యంగా మూసీ నది పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలపై మరింత దృష్టిని సారించాలని ఏ క్షణమైనా వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

ట్యాంక్ బండ్, మీర్ ఆలమ్ కాలువల లోతట్టు ప్రాంతాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు కురుస్తున్న వర్షపాతాన్ని కొలుస్తూ, సంబంధిత అధికారులను, ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. స్థానిక మునిసిపల్, రెవెన్యూ, నీటి పారుదల తదితర విభాగాల అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తాత్కాలిక శిబిరాల్లోకి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశించారు.

ట్రాఫిక్ పోలీసులను అనుక్షణం విధుల్లో ఉంచాలని, ప్రధాన రూట్లలో నీరు చేరితే, వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని సూచించిన అంజనీకుమార్, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని చర్యలనూ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఓపెన్ నాలాల పరిస్థితిపై సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని, ఈ మూడు రోజుల పాటూ భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News