న్యూఇయర్ వేడుకలను ఎందుకు నిషేధించలేదు?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

  • కొత్త కరోనా ప్రమాదకరమని హెల్త్ డైరెక్టర్ చెపుతున్నారు
  • అయినా వేడుకలను ఎలా అనుమతించారు
  • వైన్ షాపులు, బార్లు తెరవడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు?
కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్ ప్రజలు రెడీ అయిపోతున్నారు. మరోవైపు అర్ధ రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు  తెరిచే ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. న్యూఇయర్ వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త కరోనా వైరస్ ప్రమాదకరమని ఓ వైపు హెల్త్ డైరెక్టర్ చెపుతుంటే... వేడుకలను ఎలా అనుమతిస్తారని మండిపడింది.

విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు తెరవడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపింది. వేడుకలను బయట జరుపుకోవద్దని ప్రజలకు సూచించామని ఈ సందర్భంగా కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. జనవరి 7న పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వేడుకలను నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.


More Telugu News