ఆ తెలంగాణ స్థానిక నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడంలేదు: కేఏ పాల్

  • బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత కావాలా అని బండి సంజయ్ వ్యాఖ్యలు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్
  • పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడంటూ బండి సంజయ్ పై ఆగ్రహం
ఏపీలో తిరుపతి ఉప ఎన్నికలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కు ఆగ్రహం తెప్పించాయి. బైబిల్ పట్టుకునే పార్టీ కావాలా? భగవద్గీత పట్టుకునే పార్టీ కావాలా? అని బండి సంజయ్ ఏపీ ఓటర్లను కోరడంపై పాల్ మండిపడ్డారు. ఎవరయ్యా ఆ నాయకుడు, పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడు? అంటూ వ్యాఖ్యానించారు. ఏదైనా మాట్లాడేముందు ఆ నాయకుడు ఢిల్లీలో ఉన్న వారి అగ్రనేతలను సంప్రదించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

ఆర్ఎస్ఎస్ నేతలు కూడా తనను కలుసుకునేందుకు హోటల్ కు వస్తుంటారని కేఏ పాల్ వెల్లడించారు. కానీ ఈ నేత మాత్రం స్థానిక నాయకుడి స్థాయికి దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నాడని బండి సంజయ్ పై విమర్శలు చేశారు. అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు సైతం తనను గౌరవిస్తారని, వారు అభివృద్ధి చేద్దామని భావిస్తుంటారని, కానీ కుట్రలకు పాల్పడే ఇలాంటి నేతలు మాత్రం ఏపీ, తెలంగాణను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకునేది లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పవిత్ర గ్రంథాలతో రాజకీయాలు చేస్తారా? అంటూ ఆవేశం ప్రదర్శించారు.


More Telugu News