కార్పొరేట్ కాలేజీల చరిత్ర మా దగ్గర ఉంది... తవ్వడం ప్రారంభిస్తే మీ గతి మారిపోతుంది: బండి సంజయ్

  • లెక్చరర్లు, టీచర్ల జీతాలపై బండి సంజయ్ స్పందన
  • జీతాలు ఎందుకివ్వరంటూ కార్పొరేట్ విద్యాసంస్థలపై ఆగ్రహం
  • లెక్చరర్లకు తాము అండగా ఉంటామని వ్యాఖ్యలు
  • ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచన
కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది వేతనాల వెతలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది శ్రమతో కోట్ల రూపాయలు సంపాదించుకుని వారిని రోడ్డున పడేస్తారా? అంటూ మండిపడ్డారు.

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని స్పష్టం చేశారు. మీ సిబ్బందితో చర్చించుకుని సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. మీరు ఈ అంశంపై స్పందించకపోతే అధ్యాపకులు, ఉపాధ్యాయుల తరఫున బీజేపీ కార్యాచరణను ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 "మూడు నెలల క్లాసుల కోసం ఏడాది మొత్తానికి ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి జీతాలు ఎందుకివ్వరు?" అని నిలదీశారు. కార్పొరేట్ కాలేజీల చరిత్ర మా వద్ద ఉంది, చరిత్ర తవ్వడం ప్రారంభిస్తే మీ గతి మారిపోతుంది జాగ్రత్త! అని హెచ్చరించారు. జీతాలు ఇవ్వాలని కోర్టు చెప్పినా కార్పొరేట్ విద్యాసంస్థలు ఆ ఆదేశాలను పట్టించుకోవడంలేదని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తోంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల్లో చాలామందికి కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయని, టీఆర్ఎస్ పెద్దలు కార్పొరేట్ కాలేజీలకు కొమ్ముకాస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

"ఈ వ్యవహారంలో మేం దృష్టి పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. మేం ఓట్ల కోసం, సీట్ల కోసం ఇలాంటి ఉద్యమాలు చేయం. కార్పొరేట్ విద్యాసంస్థలు దిగిరావాల్సిందే. ఈ సమయంలో అధ్యాపకులు అప్రమత్తంగా ఉండాలి. సీఎం కేసీఆర్ మిమ్మల్ని చీల్చే కుట్ర చేస్తాడు. మీకు జీతాలు ఇచ్చే వరకు తగ్గొద్దు" అని బండి సంజయ్ సూచించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని, బీజేపీ అండగా ఉంటుందని  భరోసా ఇచ్చారు.


More Telugu News