తాను కరోనా వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవడం లేదో వివరించిన హర్యానా ఆరోగ్య మంత్రి!

  • నాలో యాంటీబాడీల కౌంట్ 300గా ఉంది
  • ట్రయల్ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా దీనికి తోడ్పడింది
  • వ్యాక్సిన్ వేయించుకోవడానికి సంకోచం అవసరం లేదు
రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 60 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈరోజు నుంచి వ్యాక్సిన్ వేస్తున్నారు. తొలి వ్యాక్సిన్ ను ప్రధాని మోదీ వేయించుకున్నారు. అయితే, హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మాత్రం తనకు వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు.

ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, 'ప్రజల కోసం ఈరోజు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు. నేను వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. నాకు కరోనా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత చికిత్స చేయించుకున్నందుకు నాలో యాంటీబాడీలు పెరిగాయి. ప్రస్తుతం నా యాంటీబాడీల కౌంట్ 300గా ఉంది. నేను ట్రయల్ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా యాంటీబాడీల పెరుగుదలకు తోడ్పడింది. నాకు ఇప్పుడు వ్యాక్సిన్ అవసరం లేదు' అని ఆయన అన్నారు.

గత డిసెంబర్ లో అనిల్ విజ్ కు కరోనా సోకింది. నవంబర్ లో కోవాక్సిన్ ట్రయల్ డోస్ ను ఆయన వేయించుకున్నారు. మూడో ఫేజ్ ట్రయల్ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆయనకు వైరస్ సోకడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన కేవలం ఒక డోస్ మాత్రమే తీసుకున్నారని, రెండో డోస్ పెండింగ్ లో ఉందని, ఇంతలోనే ఆయనకు కరోనా సోకిందని ఆ తర్వాత వైద్యులు క్లారిటీ ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 లక్షల మంది ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.


More Telugu News