ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపనా దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • విద్యారంగానికి వర్సిటీ ఊతమిస్తుందన్న వెంకయ్య
  • ఏపీ అభివృద్ధిలో భాగమవుతుందని వెల్లడి
  • రాయలసీమకు చారిత్రక ప్రాధాన్యత ఉందని వివరణ
  • వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు
అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపనా దినోత్సవంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించే విధంగా, విద్యారంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో రాయలసీమలో ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ విద్యాసంస్థ స్థాపనా దినోత్సవంలో పాల్గొడనం ఆనందం కలిగిస్తోందని తెలిపారు.

చదువుతో పాటు విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయల గురించి తెలుసుకోవాలన్నదే తన ఆకాంక్ష అని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. మహోన్నత విజయనగర సామ్రాజ్య వైభవాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రపంచస్థాయి ప్రమాణాలతో భవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా ఈ వర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

విజయనగర సామ్రాజ్యంలో భాగమైన రాయలసీమకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సాహిత్యం, కళలకు ఈ ప్రాంతం ఒకప్పుడు చుక్కానిగా నిలిచిందని అన్నారు. కాగా, వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సెంట్రల్ వర్సిటీ అధికారులు కూడా పాల్గొన్నారు.


More Telugu News