గోవు గురించి మాట్లాడితే పాపం చేసినట్టు చూస్తున్నారు: ప్రధాని మోదీ

  • రూ. 870 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన
  • పది రోజుల్లో రెండుసార్లు వారణాసిలో పర్యటన
  • ఎవరేమనుకున్నా గోవు తమకు అమ్మలాంటిదేనని స్పష్టీకరణ
  • గతంతో పోలిస్తే దేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్న ప్రధాని
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి మోదీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలో నిన్న రూ. 870 కోట్ల విలువైన 22 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ.. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

గోవు తమకు అమ్మలాంటిదని, దాని గురించి తాము మాట్లాడుతుంటే.. కొందరు మాత్రం ఏదో పాపం చేస్తున్నట్టు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు కొందరికి పాపం కావొచ్చేమో కానీ, తమకు మాత్రం పూజనీయమని అన్నారు.

గోవులు, గేదెలపై కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్నారని, కొందరు మాత్రం వాటిపై జోకులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడి రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఆరేడేళ్లతో పోలిస్తే దేశంలో పాల ఉత్పత్తి 45 శాతం మేర పెరిగిందన్నారు. ప్రపంచంలోని మొత్తం పాల ఉత్పత్తిలో 22 శాతం ఒక్క మన దేశం నుంచే ఉత్పత్తి అవుతోందన్నారు.

పాల ఉత్పత్తిలోనే కాకుండా పాడి రంగాన్ని మరింతగా విస్తరిస్తోందంటూ యూపీలోని యోగి ప్రభుత్వాన్ని మోదీ కొనియాడారు. కాగా, వారణాసిలో మోదీ పర్యటించడం గత పది రోజుల్లో ఇది రెండోసారి. ఇప్పటి వరకు ఇక్కడ రూ. 2,095 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.


More Telugu News