కేంద్ర మంత్రిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసు.. బిశ్వేశ్వ‌ర్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్

  • గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
  • అలాంటిదేమీ త‌మ‌కు రాలేద‌ని కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌
  • అబద్ధం చెప్పి మంత్రి పార్ల‌మెంటును త‌ప్పుదోవ ప‌ట్టించార‌న్న టీఆర్ఎస్‌
  • బిశ్వేశ్వ‌ర్ తుడు బ‌ర్త‌ర‌ఫ్ కోసం లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌ట్టు
  • స‌భ‌లో నినాదాలు.. ఆ త‌ర్వాత స‌భ నుంచి వాకౌట్
కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడును త‌క్ష‌ణ‌మే కేంద్ర కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు బుధ‌వారం లోక్‌స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగారు. త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి పార్ల‌మెంటును మంత్రి త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. అదే స‌మ‌యంలో గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని కూడా ఎంపీలు డిమాండ్ చేశారు. మంత్రిపై చ‌ర్య‌ల‌కు కేంద్రం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాని వైనానికి నిర‌స‌న‌గా పార్ల‌మెంటు నుంచి వాకౌట్ చేశారు. 

గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు.. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎలాంటి తీర్మానం రాలేద‌ని ప్ర‌క‌టించారు. దీంతో మంత్రి అబ‌ద్ధం చెప్పార‌న్న విష‌యాన్ని గుర్తించిన టీఆర్ఎస్ ఎంపీలు ఆయ‌న‌పై లోక్ స‌భ‌లో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. గిరిజ‌నుల రిజర్వేష‌న్ల‌పై అబ‌ద్ధం చెప్పిన మంత్రి గిరిజ‌నుల‌తో పాటు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.


More Telugu News