కాలిబూడిదైన మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రాణాలు కాపాడుకున్న యజమాని

  • ప్రయాణిస్తుండగా సీటు కింది నుంచి మంటలు
  • యజమాని అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిబూడిదవుతున్న ఘటనలు ఇటీవల వరుసపెట్టి వెలుగులోకి వస్తున్నాయి. మార్చి నెలలో తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో చార్జింగ్ పెడుతున్న సమయంలో స్కూటర్ పేలిపోయింది. ఈ ఘటనలో తండ్రీకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. అలాగే తిరుచిరాపల్లి, తెలంగాణ, ఏపీలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. విజయవాడలోని గులాబీపేటలో ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మృతుడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి 

తాజాగా తమిళనాడులోని హోసూరులో మరో ప్రమాదం జరిగింది. స్కూటర్‌‌పై ప్రయాణిస్తున్న సమయంలో సీటు కింద అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. గమనించిన స్కూటర్ యజమాని సతీష్ కుమార్ అప్రమత్తమై స్కూటర్‌ను ఆపేసి పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. అనంతరం స్థానికుల సాయంతో మంటలు అదుపు చేసినప్పటికీ అప్పటికే స్కూటర్ వెనకభాగం పూర్తిగా కాలి బూడిదైంది. 

తాను ఈ వాహనాన్ని గతేడాదే కొనుగోలు చేసినట్టు సతీష్ కుమార్ చెప్పారు. కాగా, బ్యాటరీల్లో నాణ్యతా లోపాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వరుస ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. బ్యాటరీల విషయంలో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తయారీదారులను హెచ్చరించింది.


More Telugu News