హార్దిక్ బాగా పరిగెత్తలేకపోయాడు.. నేను టెన్షన్ పడ్డా: డేవిడ్ మిల్లర్

  • పాండ్యా చాలా ప్రశాంత స్వభావుడన్న మిల్లర్ 
  • చేజింగ్ అంటే పడి చస్తాడని కామెంట్
  • గెలుపు క్రెడిట్ హార్దిక్ దేనంటూ వ్యాఖ్య
నరాలు మెలేసే ఉత్కంఠ పోరులో చివరకు గుజరాత్ దే పై చేయి అయింది. ఆ పోరాటంలో డేవిడ్ మిల్లర్ ధనాధన్ బ్యాటింగే కీలకమైంది. అప్పటిదాకా నిదానంగా ఆడిన అతడు.. ఒక్కసారిగా బౌలర్లపై ఎదురు దాడికి దిగేశాడు. చివరి ఓవర్ లో తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలచి జట్టును ఫైనల్స్ కు చేర్చాడు. అయితే, ఆ ప్రయత్నంలో తాను చాలా టెన్షన్ పడ్డానని మిల్లర్ చెబుతున్నాడు. గెలుపు క్రెడిట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాదే అంటున్నాడు. 

బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డానని, హార్దిక్ తనను చల్లబరిచాడని చెప్పాడు. ఏం చేయాలో.. ఎలా చేయాలో సలహాలిచ్చాడని పేర్కొన్నాడు. ‘‘టెన్షన్ పడుతున్న నన్ను పదేపదే హార్దిక్ కూల్ చేశాడు. గ్యాప్ లో బంతిని కొట్టాలని చెప్పాడు. మంచి క్రికెట్ షాట్స్ ఆడాలని సూచించాడు. వికెట్ల మధ్య హార్దిక్ వేగంగా పరిగెత్తలేకపోయాడు. అయితే, నేను మాత్రం వికెట్ల మధ్య పరిగెత్తడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. హార్దిక్ సలహాలు, వికెట్ల మధ్య పరుగులు నాకు మేలు చేశాయి’’ అని మిల్లర్ వివరించాడు. 

చివరి రెండు ఓవర్లలో బంతిని వీలైనంత ఎక్కువ గట్టిగా బాదేందుకే ప్రయత్నించానని మిల్లర్ తెలిపాడు. చివరి ఓవర్ లో అది ఫలించిందన్నాడు. హార్దిక్ పాండ్యా చాలా ప్రశాంతత కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. చేజింగ్ అంటే పడి చస్తాడని మిల్లర్ పేర్కొన్నాడు.


More Telugu News