ఈ ఏడాది ఇక్కడ జెండా ఎగరేసిన కోలీవుడ్ సినిమాలు ఈ రెండే!

  • కోలీవుడ్ నుంచి వరుసగా థియేటర్లలో దిగిన సినిమాలు 
  • అజిత్ .. విజయ్ .. సూర్య వంటి స్టార్ లకు తప్పని ఫ్లాపులు 
  • 'పొన్నియిన్ సెల్వన్' ను పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు 
  • విశాల్ ఇమేజ్ ను డామేజ్ చేసిన 'లాఠీ'
  • హిట్ కొట్టిన హీరోల జాబితాలో కమల్ .. కార్తి  
ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోలంతా తమ సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా కోలీవుడ్ నుంచి చాలా సినిమాలు టాలీవుడ్ బాటపట్టాయి. అలా అజిత్ హీరోగా వచ్చిన 'వలిమై' ఇక్కడి ఆడియన్స్ కి ఎంతమాత్రం కనెక్ట్ కాలేకపోయింది. ఇక విజయ్ నుంచి వచ్చిన 'బీస్ట్' పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ నుంచి వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

సూర్య హీరోగా పాండిరాజ్ తెరకెక్కించిన 'ఈటి' సినిమా థియేటర్లకు వచ్చిన విషయాన్ని కూడా జనాలు పట్టించుకోలేదు. శివకార్తికేయన్ హీరోగా చేసిన 'ప్రిన్స్'పై కొన్ని అంచనాలు ఉండేవి. కానీ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. అనుదీప్ కామెడీని నమ్ముకుని వెళ్లిన ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. ఇక భారీ బడ్జెట్ తో మణిరత్నం నుంచి వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ 1' తమిళంలో బాగానే ఆడిందిగానీ, తెలుగు ప్రేక్షకుల ఆదరణను మాత్రం పొందలేకపోయింది. 

రీసెంట్ గా విశాల్ నుంచి 'లాఠీ' వచ్చింది. ఇక్కడి థియేటర్లలో ఈ సినిమా ఒక్కరోజు నిలబడటమే కష్టమైపోయింది. విశాల్ కెరియర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. ఇక కమల్ నుంచి వచ్చిన 'విక్రమ్' ..  కార్తి నుంచి వచ్చిన 'సర్దార్' సినిమాలు మాత్రం, తమిళంతో పాటు ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టాయి. యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కొత్త రికార్డులను నమోదు చేశాయి.


More Telugu News