సీఎం.. సీఎం అంటూ ఉన్న పోస్ట్ ఊడగొట్టారు... ఈ పోస్ట్ అయినా ఉండనీయండి!: బండి సంజయ్

  • బీజేపీలో ఎమ్మెల్యేలు, అధిష్ఠానం కలిసి నిర్ణయిస్తే సీఎంను ప్రకటిస్తారన్న సంజయ్
  • ఏమీ చేయని బీఆర్ఎస్‌కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్న
  • కేటీఆర్‌ను సీఎం ఎప్పుడు చేస్తావంటూ కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని ఎద్దేవా  
బీజేపీలో ఎమ్మెల్యేలు, అధిష్ఠానం అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటేనే ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటిస్తారని కరీంనగర్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆయన బుధవారం బిచ్కుందలో విజయశంఖారావం రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సీఎం... సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో బండి సంజయ్ స్పందిస్తూ... అందరూ కలిసి సీఎం ఎవరో నిర్ణయం తీసుకుంటారని, మీరు ఇలా సీఎం.. సీఎం అని నా పోస్టును ఊడగొట్టారని చమత్కరించారు. సీఎం.. సీఎం అని మళ్లీ మళ్లీ అంటూ ఇప్పుడు ఉన్న పోస్టును కూడా ఊడపీకవద్దని నవ్వుతూ అన్నారు.

బండి సంజయ్ ఇంకా మాట్లాడుతూ... తమ్ముళ్లను కలిసిపోమని అరుణక్క చెప్పిందని, అందుకే వచ్చానన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే అరుణక్కను గెలిపించాలన్నారు. జుక్కల్‌లో సరైన రోడ్లు లేవని, లెండి ప్రాజెక్టుకు నీళ్లు లేవన్నారు. ప్రజలతో ఆటలు ఆడవద్దని హెచ్చరించారు. ఇక్కడ ఆర్టీసీ డిపో లేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవన్నారు. ఇవన్నీ చేయని కేసీఆర్‌కు ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్‌ను ఇంకెప్పుడు ముఖ్యమంత్రిని చేస్తావంటూ కేసీఆర్‌తో కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని సెటైర్లు వేశారు.


More Telugu News