యూఏఈలో లక్కీ డ్రాలో రూ.45 కోట్లు గెలుచుకున్న భారతీయుడు.. అతడి స్పందన ఏంటంటే..!

  • రాత్రికి రాత్రే సంపన్నుడిగా మారిన కేరళకు చెందిన శ్రీజు
  • ఇంతపెద్ద లక్కీ డ్రా వరించడం నమ్మలేకపోయానని ఆశ్చర్యం
  • 11 ఏళ్లుగా ఓ గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్‌గా జీవనోపాధి
డబ్బు సంపాదన లక్ష్యంగా చాలామంది భారతీయులు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వలస వెళ్తుంటారు. వారిలో చాలామంది లాటరీలు, జాక్‌పాట్‌లతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఆ విధంగా సంపన్నులుగా మారిన భారతీయులు చాలామందే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో మరో భారతీయుడు చేరాడు. 

కేరళకు చెందిన శ్రీజు ఏకంగా రూ.45 కోట్ల లక్కీ డ్రాలో విజేతగా నిలిచాడు. బుధవారం నిర్వహించిన ‘మహ్‌జూజ్ సాటర్‌డే మిలియన్స్ డ్రా’లో ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. 39 ఏళ్ల శ్రీజు ఒక చమురు-గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఇంతపెద్ద లక్కీ డ్రా గెలవడాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. కారులో వెళ్తున్న సమయంలో మహ్‌జూజ్ అకౌంట్‌ను పరిశీలించానని, తన కళ్లతో చూసింది ఏమాత్రం నమ్మలేకపోయానని వివరించాడు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డానని, నిర్ధారణ కోసం మహ్‌జూజ్ లక్కీ డ్రా నుంచి ఫోన్ కోసం ఎదురుచూశానని, నిజమని తెలిసి ఆశ్చర్యపోయానని శ్రీజు వెల్లడించారు.

కాగా శ్రీజు 11 ఏళ్ల నుంచి యూఏఈలో పనిచేస్తున్నాడు. అయితే అక్కడ సంపాదించిన డబ్బుతో కేరళలో ఇల్లు కూడా కట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే అతడి తలరాత మారిపోయింది. కాగా గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఈ విధంగా లక్కీ డ్రాలు, లాటరీలు గెలవడం కొత్తేమీ కాదు. గత శనివారం యూఏఈలోని కేరళకు చెందిన శరత్ శివదాసన్ సుమారు రూ.11 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. ఇదే డ్రాలో ముంబైకి చెందిన మనోజ్ భావ్‌సర్ అనే మరో వ్యక్తి కొంత డబ్బు గెలుచుకున్నాడు. కాగా యూఏఈలో లక్కీ డ్రాలలో గెలుచుకునే డబ్బుపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు డ్రా ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది.


More Telugu News