ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఎయిడ్స్ ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా?

  • గణనీయంగా తగ్గుతున్న కేసులు
  • కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయన్న యూఎన్ ఎయిడ్స్ తాజా నివేదిక
  • 2022లో ప్రపంచవ్యాప్తంగా 10.3 లక్షల కొత్త కేసుల నమోదు
  • తూర్పు, దక్షిణాఫ్రికాలో 57 శాతం క్షీణత
  • మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో ఇన్ఫెక్షన్లు 61 శాతం పెరిగినా.. గతేడాది కేసుల్లో గణనీయమైన క్షీణత
ఇది నిజంగా సంతోషించే విషయమే. ఒకప్పుడు ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన హెచ్ఐవీ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. యూఎన్ ఎయిడ్స్ తాజా నివేదిక ప్రకారం.. 2022లో ప్రపంచవ్యాప్తంగా 10.3 లక్షల కొత్త ఇన్ఫెక్షన్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ సంఖ్య ఎక్కువే అయినప్పటికీ దశాబ్దాల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో ఇన్ఫెక్షన్లు నమోదు కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా హెచ్ఐవీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో క్షీణత గణనీయంగా నమోదు కావడం కొంత సంతోషకరమైన విషయమే. 

యూఎన్ ఎయిడ్స్ నివేదిక ప్రకారం.. తూర్పు, దక్షిణాఫ్రికాలో 2010-2022 మధ్య 57 శాతం క్షీణత నమోదైంది. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఏటా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గతేడాది 5 లక్షల కేసులు వెలుగుచూశాయి. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో 14 శాతం కేసులు క్షీణించినప్పటికీ తూర్పు, దక్షిణాఫ్రికా తర్వాత కేసుల నమోదులో రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ గతేడాది 3 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.

హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న ప్రాంతాల్లో లాటిన్ అమెరికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం, ఉత్తరాఫ్రికా ఉన్నాయి. లాటిన్ అమెరికాలో పైన చెప్పుకున్న పుష్కరకాలంలో లాటిన్ అమెరికాలో కేసులు 8 శాతం పెరిగాయి. గతేడాది ఇక్కడ 1.1 లక్షల కేసులు నమోదయ్యాయి. తూర్పు యూరప్, మధ్య ఆసియా ప్రాంతంలో గత 12 ఏళ్లలో 49 శాతం కేసులు పెరిగాయి. గతేడాది ఈ ప్రాంతంలో 1.6 లక్షల ఇన్ఫెక్షన్లు వెలుగుచూశాయి. ఇక అత్యధికంగా మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో కేసులు ఏకంగా 61 శాతం పెరిగాయి. అయితే, గతేడాది మాత్రం 17 వేల ఇన్ఫెక్షన్లు మాత్రమే నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 14 ఏళ్లలోపు పిల్లలు, 15-24ఏళ్ల మధ్య వారిలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు బాగా తగ్గాయి. మహిళల్లో కొత్త ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉండడం, చికిత్స ఎక్కువ మందికి అందుతుండడమే ఇందుకు కారణమని నివేదిక వివరించింది.


More Telugu News