సిగ్గు లేకుండా 'ఆడుదాం ఆంధ్రా' అంటున్నాడు: పట్టాభిరామ్

  • పంట నష్టం, బీమా అంశాలపై పట్టాభిరామ్ ప్రెస్ మీట్
  • సీఎం జగన్ పై తీవ్ర విమర్శనాస్త్రాలు
  • రైతు పక్షపాతి అని చెప్పుకునే జగన్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు 2018-19లో 16 లక్షల మంది రైతులకు రూ.1,885కోట్ల పంట నష్టపరిహారం అందిస్తే... 2023 ఖరీఫ్ కి జగన్ రెడ్డి కేవలం 16 మంది రైతులకే పంటల బీమా ప్రీమియం కట్టాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. ఇదేనా జగన్ రెడ్డి పదే పదే చెప్పే రైతు పక్షపాతం అని నిలదీశారు. 

కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం... 2018-19లో కట్టిన ప్రీమియం కంటే అధికంగా 172.8 శాతం బీమా సొమ్ము రైతులకు నష్టపరిహారంగా చెల్లించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని అన్నారు. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి తాను రైతులకు చెల్లించిన పంటలబీమా నష్టపరిహారం సొమ్ము ఎంతన్నది తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల వల్ల సుమారు 60 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని... రైతులు రూ.30వేల కోట్లు నష్టపోయారని పట్టాభి వెల్లడించారు. కానీ, 2019 నుంచి 2023 వరకు ఎంతమంది రైతులకు ఎంత బీమా ప్రీమియం చెల్లించాడో.. పంటలు నష్టపోయిన రైతులకు ఎంత సొమ్ము చెల్లించాడో పూర్తి వాస్తవాలతో జగన్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని స్పష్టం చేశారు. రైతులపై తనకున్న చిత్తశుద్ధి ఏమిటో జగన్ రెడ్డి అన్నదాతల సాక్షిగా నిరూపించుకోవాలని అన్నారు. 

రైతుల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకున్న జగన్ రెడ్డి సిగ్గులేకుండా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మిగ్జామ్ తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎప్పటిలానే మొద్దు నిద్ర పోయిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడంతో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో  రాష్ట్రవ్యాప్తంగా భారీనష్టం జరిగిందని పట్టాభి విమర్శించారు.


More Telugu News