కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఇక చూస్తారు: కేటీఆర్

  • సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
  • హాజరైన కేటీఆర్
  • ప్రజా గళం వినిపించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అన్న కేటీఆర్
సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజల తరఫున గొంతుకను వినిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలని హితవు పలికారు. 

గతంలోనూ చాలామంది ఇలాగే కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను తొక్కేస్తామన్నారని, అలాంటివారు ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

"కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఇక చూస్తారు. రేవంత్ రెడ్డి... కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు. మీ గురువులతోనే కాలేదు, మీ వల్లే ఏం అవుతుంది?" అంటూ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీ మేనేజ్ మెంట్ కోటాలో సీఎం పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలేనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల అమలును తప్పించుకునేందుకు నిత్యం ఏదో ఒక అవినీతి కథ అల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆరు డిక్లరేషన్లు అంటూ ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని, నాడు కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని అన్నారు. ఉచిత బస్సు పథకంతో బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్నారని, ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతోందని కేటీఆర్ వెల్లడించారు. ఏదైనా పథకం ప్రకటించేటప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచించి తీసుకురావాలని హితవు పలికారు.


More Telugu News