ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి: సజ్జల స్పందన

  • దేశంలో అన్ని దశల పోలింగ్ పూర్తి
  • ఈ సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్
  • వైసీపీ విజయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టీకరణ 
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. అంచనాలను అందుకోవడం కంటే కూడా, తమ పార్టీకి సానుకూల ఒరవడి కనిపిస్తోందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయి కాబట్టి, దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతోందని... దీనికి సంబంధించిన సర్వేలు, విశ్లేషణలు అందరం చూస్తున్నామని తెలిపారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్టు అర్థమవుతోందని సజ్జల పేర్కొన్నారు. లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు. 

అయితే, ఈ ఐదేళ్లలో ఓ కుటుంబంలో మహిళ కేంద్రబిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని, దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లడైందని సజ్జల వివరించారు. 

మరోవైపు... తమదే విజయం అని కూటమి రచ్చ చేస్తోందని, వారి హంగామా ముందు సైలెంట్ ఓటింగ్ అంశం బయటికి రాలేదేమో అనిపిస్తోందని వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలే కౌంటింగ్ రోజున రానున్నాయని మా నమ్మకం అని సజ్జల స్పష్టం చేశారు. 

వైనాట్ 175 అని తాము అంటున్నామని, ఎందుకలా అనేదానికి తమ వద్ద అనేక కారణాలు ఉన్నాయని, ఆ దిశగా తమను అడ్డుకోలేకపోతే అందుకు కూటమి పార్టీలే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తమను వ్యతిరేకిస్తున్న వాళ్ల గొంతుక బలంగా ఉందని, దానికి తోడు అన్ని పార్టీలు కలిశాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తాము గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు వెళ్లడం అనేది పెద్ద ఘనతగానే భావిస్తామని చెప్పారు. 

చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడ్డానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల గురించి ఎందుకు చెప్పుకోలేకపోయాడో చంద్రబాబే జవాబు చెప్పాలని అన్నారు. 

జగన్ మాత్రం తాము ఇంతకాలం చేస్తూ వచ్చిన పాలన గురించి ప్రచారం చేయడానికే కట్టుబడి ఉన్నాడని వివరించారు. 2014లో ఇదే కూటమి వచ్చినా హామీలు అమలు చేయలేకపోయారన్న విషయాన్ని జగన్ తన ప్రచారంలో ఎత్తిచూపారని వెల్లడించారు.  అందుకే వైసీపీ ధైర్యంగా ప్రజలను ఓటు అడగ్గలిగిందని, రేపు ఎన్నికల ఫలితాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుందని సజ్జల పేర్కొన్నారు.


More Telugu News