ఒక్క‌ డైలాగ్‌తో మ్యాచ్‌ను భార‌త్ వైపు తిప్పేసిన రోహిత్‌.. కెప్టెన్ మోటివేష‌న్ సింప్లీ సూప‌ర్బ్‌!

  • న్యూయార్క్ వేదిక‌గా భార‌త్‌, పాక్ మ్యాచ్‌
  • దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా చిరస్మరణీయ విజయం
  • మ్యాచ్ మ‌ధ్య‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఇచ్చిన మోటివేష‌న్‌ ప్లేయ‌ర్లపై గ‌ట్టి ప్ర‌భావం
  • 'మనకు జరిగినట్లే, వాళ్లకూ జరగవచ్చు'.. ఈ ఒక్క డైలాగ్ ఎంతో ప‌నిచేసింద‌న్న రోహిత్‌
  • జ‌స్ప్రీత్ బుమ్రాపై హిట్‌మ్యాన్‌ ప్ర‌శంస‌ల జ‌ల్లు 
2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన (3/14)తో ఆకట్టుకున్న వేళ భార‌త్ చారిత్ర‌క గెలుపును న‌మోదు చేసింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఆరు పరుగుల తేడాతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఉత్కంఠభ‌రితంగా సాగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇంతటి అద్భుతమైన విక్ట‌రీ తర్వాత భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.

"మేం సరిగా బ్యాటింగ్ చేయలేదు. ఇన్నింగ్స్ సగం వరకు మేము మెరుగైన స్థితిలోనే ఉన్నాం. కానీ, మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమయ్యాం. ఇలాంటి పిచ్ పై ప్రతీ పరుగు ముఖ్యమే. గత మ్యాచ్‌తో పోలిస్తే పిచ్ బాగుంది. మాకు ఉన్న బౌలింగ్ లైనప్ తో మేం సాధించగలమన్న నమ్మకంతో ఉన్నాం. వాళ్ల ఇన్నింగ్స్ సగం పూర్తయ్యాక అందర్నీ పిలిచి ఒకే మాట చెప్పాను. 'మనకు జరిగినట్లే, వాళ్లకు కూడా జరగవచ్చు. ప్రతి ఒక్కరి నుంచి కొంత‌ సహకారం భారీ ప్ర‌భావం చూపిస్తుంది' అని చెప్పాను. 

ఇక బుమ్రా సామర్థ్యం గురించి అందరికీ తెలుసు. అతడి గురించి ఎక్కువగా మాట్లాడను. అతడు జీనియస్. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌ మొత్తం అతడు ఇలాంటి మైండ్‌సెట్‌తోనే ఉండాలని ఆశిస్తున్నా. ప్రేక్షకుల మద్దతు కూడా అద్భుతం. వాళ్లు మమ్మల్ని ఎప్పుడూ నిరాశ పర్చరు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లందరూ మొహంపై చిరునవ్వుతోనే వెళ్తారు. టోర్నీలో ఇది ఆరంభం మాత్రమే. మేం సాధించాల్సింది చాలా ఉంది" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఇక‌ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తున్న న‌సావు కౌంటీ పిచ్ పై భారీ స్కోర్లపై ఎవరికీ పెద్దగా ఆశల్లేవు. కానీ, భార‌త్ క‌నీసం 150+ ప‌రుగులైనా చేస్తుందనుకున్నారు. అయితే, టీమిండియా 19 ఓవర్లకు 119 పరుగులకే ప‌రిమిత‌మైంది. రిషభ్ పంత్ (42 రన్స్‌) మినహాయిస్తే ఎవ‌రూ పెద్దగా రాణించలేదు. 

ఆ త‌ర్వాత‌ స్వల్ప లక్ష్యఛేదనలో దాయాది జ‌ట్టు 12 ఓవర్లకు 72-2తో మెరుగైన స్థితిలో నిలిచింది. అప్పటికి పాక్ గెలుపునకు 48 బంతుల్లో 48 ర‌న్స్‌ కావాలి. దీంతో భార‌త్‌కు ప‌రాజ‌యం తప్పదు అనుకున్నారంతా. కానీ, ఆ తర్వాత అసలు కథ మొదలైంది. సార‌ధి రోహిత్ శ‌ర్మ‌ మోటివేషన్‌తో భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బ్యాట‌ర్లు పరుగులు చేయకుండా కట్టడి చేశారు. 

అలాగే వ‌రుస విరామాల్లో వికెట్లు తీసి పాకిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా బుమ్రా త‌న‌ 15, 19 ఓవర్లలో 3, 3 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఒక్కో వికెట్ పడగొట్ట‌డం మ్యాచ్‌ను పూర్తిగా భార‌త్‌ చేతుల్లోకి తెచ్చింది. అందరూ సమష్టిగా రాణించి టీమిండియాకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజయాన్ని అందించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్‌ బుమ్రా 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.


More Telugu News