నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ఎక్కడికైనా సరే ఫ్రీ వీసా... అమెరికా స్టార్టప్ సీఈవో బంపర్ ఆఫర్

  • పారిస్ ఒలింపిక్స్ లో నేడు జావెలిన్ త్రో ఫైనల్
  • నీరజ్ చోప్రాపై భారీగా ఆశలు పెట్టుకున్న భారత్
  • గత ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు సాధించింది నాలుగు పతకాలే... అవి కూడా కాంస్యాలు. ఇక భారతీయుల స్వర్ణం ఆశలన్నీ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో అంశంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా, ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లోనూ పసిడి ఆశలు రేపుతున్నాడు. 

ఈ రాత్రికి జావెలిన్ త్రో క్రీడాంశంలో ఫైనల్ జరగనుంది. నీరజ్ చోప్రా రాణించి గోల్డ్ మెడల్ గెలవాలని యావత్ భారతదేశం ముక్తకంఠంతో కోరుకుంటోంది. 

ఇక అసలు విషయానికొస్తే... నీరజ్ చోప్రా గనుక పారిస్ ఒలింపిక్స్ స్వర్ణం గెలిస్తే తమ యూజర్లందరికీ ఉచితంగా వీసాలు ఇస్తామని అమెరికాకు చెందిన ఓ ట్రావెల్ స్టార్టప్ ప్రకటించింది. ఈ స్టార్టప్ పేరు అట్లీస్. దీని సీఈవో మోహక్ నహతా. ఈ సంస్థ ప్రయాణ వీసాలు పొందడంలో సహకారం అందిస్తుంటుంది. 

ఈ సంస్థ సీఈవో మోహక్ నహతా లింక్డ్ ఇన్ లో పెట్టిన పోస్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నీరజ్ చోప్రా గనుక గోల్డ్ మెడల్ గెలిస్తే అందరికీ ఒక రోజంతా వర్తించేలా ఎక్కడికి వెళ్లడానికైనా సరే ఉచిత వీసాలు అందిస్తామని ప్రకటించారు. ఏ దేశస్తులైనా ఫర్వాలేదని, ఎలాంటి రుసుం తీసుకోకుండా అందరికీ ఫ్రీ వీసా ఇస్తామని, తానే స్వయంగా వీసా పంపిస్తానని మోహక్ నహతా పేర్కొన్నారు.


More Telugu News