మెగా ఫ్యామిలీ నుంచి తనకు గిఫ్ట్ ఖాయమంటున్న నటుడు పృథ్వీరాజ్

  • చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు
  • మొగల్తూరు మహారాజు ..వెండి తెర రారాజు చిరంజీవి అంటూ పృథ్వీ వ్యాఖ్య
  • జగన్ పార్టీపై సెటైర్లు
మొగల్తూరు మహారాజు..వెండి తెర రారాజు అన్న చిరంజీవి అంటూ నటుడు పృథ్వీరాజ్ కొనియాడారు. చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పృథ్వీరాజ్ ..మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుండి తనకు గిఫ్ట్ రాబోతోందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీపై సెటైర్ లు వేశారు. 

మన పార్టీకి (జగన్) 11 సీట్లు వచ్చాయని, 11 – 11 కలుపుకుంటే 22 అని 22వ తేదీ మెగాస్టార్ పుట్టిన రోజు అని అన్నారు. ఇది దేవుడి స్క్రిప్టు అన్నారు. కొణిదెల శివశంకర వర ప్రసాద్ (మెగాస్టార్ చిరంజీవి) అని పేరు పలికితేనే ఒక వైబ్రేషన్ అని అన్నారు. ఆ పేరు పలకడానికి అర్హత ఉందా అని మనం ప్రశ్నించుకోవాలన్నారు. తనది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అని ఆ పక్కనే ఉన్న మొగల్తూరు.. చిరంజీవిదన్నారు. అన్న చిరంజీవి ఆత్మాభిమానం కలవారని, ఎవరు ఏమి మాట్లాడినా వారి ఖర్మ అని ఖర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని అన్నారు. వారి పాపాన వారే పోతారని అనుకుంటారన్నారు. 

ప్రపంచం ఉన్నంత వరకూ చిరంజీవి ప్రజల హృదయాల్లో చిరంజీవేనని పృథ్వీరాజ్ అన్నారు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ పృథ్వీరాజ్ మాట్లాడారు. ప్రతి తెలుగువాడు గర్వపడేలా మెగా అన్నదమ్ములు ఉన్నారని అన్నారు. ఓ పెద్దాయన చిరంజీవి ఏమి ఇచ్చాడని అడిగారనీ.. నాకు ఏమి ఇచ్చాడో రేపో, ఎల్లుండో తెలుస్తుంది అని పృథ్వీరాజ్ అన్నారు.


More Telugu News