కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

  • సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందన్న రేవంత్ రెడ్డి
  • కానీ కవితకు 5 నెలల్లోనే బెయిల్ వచ్చిందని వెల్లడి
  • బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపణ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కవితకు బెయిల్ రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కోణంలో స్పందించారు. 

ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని, కానీ కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ వచ్చిందని అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికీ బెయిల్ రాలేదని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు షేరింగ్ చేసినందుకు ప్రతిఫలంగానే కవితకు బెయిల్ వచ్చింది అని వ్యాఖ్యానించారు. 

కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగని తానేమీ కవితకు బెయిల్ రావడాన్ని తప్పుబట్టడంలేదని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని వివరించారు. 

తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడానికి హరీశ్ రావు పనిచేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు, కవిత బెయిల్ కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతోందని వెల్లడించారు. 

కేసీఆర్ ప్రతిపక్ష నేత... జీతం తీసుకుంటూ హోదాకు న్యాయం చేయకపోతే ఎలా?: రేవంత్ రెడ్డి

కేసీఆర్ ప్రతిపక్ష నేత అని, ప్రతిపక్ష నేత హోదాలో జీతం తీసుకుంటూ, హోదాకు న్యాయం చేయకపోతే ఎలా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ బయటికి వచ్చి ప్రజల కోసం పోరాటం చేయాలని అన్నారు. 

కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదాలో జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. జీతం తీసుకుంటున్నందుకు కేసీఆర్ ప్రజల్లో తిరగాలని హితవు పలికారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్న కేసీఆర్... తన హోదాకు తగిన విధంగా పనిచేయకపోతే ఎలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 




More Telugu News