హీరో మంచు విష్ణుకు ఉపశమనం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు సెలబ్రిటీల ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. వ్యూస్ కోసం అవహేళన చేస్తూ ఫేక్ వీడియోలు సృష్టించి వ్యాపింపజేస్తున్నారు. తెలుగు హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకి కూడా ఇటీవల ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చక్కర్లు కొట్టాయి. వీటిని తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మంచు విష్ణుకు ఊరట దక్కింది.

మంచు విష్ణు ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న వీడియోలను తొలగించాలంటూ సంబంధిత యూట్యూబ్‌ ఛానళ్ల నిర్వాహకులకు కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత వీడియోల లింక్‌లను తొలగించాలని స్పష్టం చేసింది. 48 గంటల్లో వీడియోలను తొలగించకపోతే చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌‌ను హెచ్చరించింది. 10 యూఆర్‌ఎల్‌ లింక్‌లను తొలగించాలని కేంద్ర సమాచారశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖను కూడా కోర్టు ఆదేశించింది.

విష్ణు మంచు పేరు, వాయిస్, గొంతులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ విధంగానూ ఉపయోగించవద్దని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగతంగా అవమానపరిచేలా, ప్రతిష్ఠను దిగజార్చేలా సృష్టించే వీడియో కంటెంట్‌లను వ్యాపింపజేయవద్దని హెచ్చరించింది. కాగా తన ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని, సంబంధిత వీడియోలను తొలగించాలంటూ మంచు విష్ణు పిటిషన్‌ దాఖలు చేయగా.. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మిని పుష్కర్ణ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు.


More Telugu News