టెక్నాలజీని ఉపయోగించుకోవడం అంటే ఇదే కదా.. అమెజాన్ అలెక్జాను ఉపయోగించి దీపావళి రాకెట్ ప్రయోగం.. వీడియో ఇదిగో!

  • ‘అలెక్జా, లాంచ్ ద రాకెట్’ అనగానే స్పందించిన అలెక్జా
  • ‘యస్ బాస్. లాంచింగ్ ద రాకెట్’ అని బదులిచ్చిన అలెక్జా
  • ఆ టెక్నిక్ ఏంటో తమకూ చెప్పాలంటున్న నెటిజన్లు
  • 23 మిలియన్ వ్యూస్ సంపాదించుకున్న వీడియో
విరివిగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని దుర్వినియోగం చేసేవారు కొందరైతే, దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారు మరికొందరు. ఒడిశాకు చెందిన మణి రెండో రకం. అమెజాన్ అలెక్జాను ఉపయోగించి దీపావళి రాకెట్‌ను ప్రయోగించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. 

మణీస్ ప్రాజెక్ట్ ల్యాబ్ అనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గత వారం ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో అలెక్జా వాయిస్ కమాండ్‌ను ఉపయోగించి దీపావళి రాకెట్‌ను ప్రయోగించాడు. ‘అలెక్జా, లాంచ్ ద రాకెట్’ అని మణి కమాండ్ ఇవ్వగానే.. డివైజ్ వెంటనే స్పందించింది. ‘యస్ బాస్. లాంచింగ్ ద రాకెట్’ అని బదులిచ్చింది. ఆ వెంటనే రాకెట్ అంటుకోవడం.. రయ్‌మంటూ ఆకాశంలోకి దూసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి. 

‘లాంచింగ్ ద రాకెట్ విత్ అలెక్జా’ అని క్యాప్షన్ తగిలించిన ఈ వీడియో 23 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ ప్రాసెస్ ఏంటో తమకూ చెప్పాలంటూ యూజర్లు ప్రశ్నలతో హోరెత్తిస్తున్నారు. మైక్రో కంట్రోలర్ సాయంతో తానీ ప్రయోగం చేసినట్టు మణి వివరించాడు. అలెక్జా ద్వారా వాయిస్ కంట్రోల్‌ను ఎనేబుల్ చేసి దూరంగా ఉన్న రాకెట్‌ను లాంచ్ చేయొచ్చని పేర్కొన్నాడు.  

మణి ఈ ఏడాదే బీటెక్ పూర్తిచేశాడు. తాను ఫస్టియర్‌లో ఉన్నప్పుడే పలు ప్రాజెక్టులు చేపట్టడంతోపాటు ఇంటర్నెషిప్ కూడా పూర్తిచేసినట్టు తెలిపాడు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నట్టు పేర్కొన్నాడు. ఇప్పుడు ఖాళీగా ఉండడంతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పాడు.  


More Telugu News