ఓటీటీలో దూసుకుపోతున్న 'బ్లాక్'

  • జీవా హీరోగా రూపొందిన 'బ్లాక్'
  • అక్టోబర్ 11న విడుదలైన సినిమా 
  • సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • ఈ నెల 1వ తేదీ నుంచి మొదలైన స్ట్రీమింగ్

తమిళంలో హీరోగా జీవా ఒకప్పుడు తన జోరు చూపించాడు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తన ఏజ్ గ్రూప్ హీరోల రేసులో ఆయన కొంచెం వెనకబడ్డాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ గా ప్రియాభవాని శంకర్ మాత్రం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉంది.

ఈ నేపథ్యంలో జీవా-ప్రియా భవాని శంకర్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'బ్లాక్' సినిమా, మంచి బజ్ తో థియేటర్లకు వచ్చింది. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఎస్.ఆర్.ప్రభు-ప్రకాశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి, బాలసుబ్రమణియన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ నెల 1వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

'బ్లాక్' సినిమా హారర్ టచ్ తో కూడిన 'సైన్స్ ఫిక్షన్'గా రూపొందింది. వసంత్ - అరణ్య భార్య భర్తలు. వారం రోజుల పాటు సెలవు దొరకడంతో, బీచ్ సమీపంలోని తమ కొత్త విల్లాలో గడపడానికి అక్కడికి వెళతారు. నిర్మాణం పూర్తి కాకపోవడంతో మిగతా విల్లాలన్నీ ఖాళీగానే ఉంటాయి. అయితే ఒక విల్లాలో లైట్స్ వెలుగుతుండటం చూసి అక్కడికి వెళతారు. అచ్చు తమ మాదిరిగానే ఉన్న మరో జంటను చూసి అక్కడి నుంచి పరుగందుకుంటారు. ఆ తరువాత ఏం జరుగుతుందనేది కథ.




More Telugu News