జనవరి 10 నుంచి 19 వరకూ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

  • వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష
  • పది రోజులూ వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఇతర ఆర్జిత సేవల రద్దు 
  • సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం, ఇతర అంశాలపై రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం  
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమావేశమై వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు. 

వైకుంఠ ఏకాదశికి నలబై రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు. 

వైకుంఠ ఏకాదశి పది రోజుల్లో ప్రోటోకాల్ విఐపీలు మినహా ఇతర వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో పది రోజుల పాటు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్నప్రసాదం పంపిణీ చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్‌వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ  ఇతర అధికారులు పాల్గొన్నారు.   


More Telugu News