ఏపీలో 'పుష్ప‌2' టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్రభుత్వం ఉత్త‌ర్వులు.. థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్‌!

  • రాష్ట్ర‌వ్యాప్తంగా టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు ఏపీ స‌ర్కార్‌ అనుమ‌తి
  • డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంట‌ల‌కు బెనిఫిట్ షోతో పాటు అర్ధ‌రాత్రి 1 గంట షోకు కూడా అనుమ‌తి
  • రాత్రి 9.30 ప్రీమియ‌ర్ షో టికెట్ ధ‌ర‌ రూ. 800గా నిర్ణ‌యం
  • డిసెంబ‌ర్ 5న ఆరు షోల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్
  • డిసెంబ‌ర్ 5 నుంచి 17 వ‌ర‌కు గ‌రిష్ఠంగా రూ. 200 వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటు
  • సీఎం, డిప్యూటీ సీఎంల‌కు బ‌న్నీ కృత‌జ్ఞ‌త‌లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం పుష్ప‌2: ది రూల్‌. ఈ నెల 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే చిత్ర‌బృందం ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. దీనిలో భాగంగా సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్‌కు బ‌న్నీ అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.

ఇక ఇప్ప‌టికే పుష్ప‌2 మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల పెంపుతో పాటు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తినిచ్చింది. ఇప్పుడు ఏపీ స‌ర్కార్ కూడా పుష్ప‌2 టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అనుమ‌తి లభించింది.  

అలాగే డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంట‌ల‌కు బెనిఫిట్ షోతో పాటు అర్ధ‌రాత్రి ఒంటి గంట షోకు కూడా అనుమ‌తినిచ్చింది. ఈ ప్రీమియ‌ర్ షో టికెట్ ధ‌ర‌ను రూ. 800గా నిర్ణ‌యించింది. దీనికి జీఎస్‌టీ అద‌నం. ఈ షో చూడాలంటే మ‌ల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ ఏదైనా స‌రే రూ. 800 ప్ల‌స్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మూవీ రిలీజ్ రోజైన డిసెంబ‌ర్ 5న ఆరు షోల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 

డిసెంబ‌ర్ 5 నుంచి 17 వ‌ర‌కు గ‌రిష్ఠంగా రూ. 200 (జీఎస్‌టీతో క‌లిపి) వ‌ర‌కు పెంచుకునేందుకు అనుమ‌తినిచ్చింది. మ‌ల్టీఫ్లెక్సుల్లో రూ. 200, సింగిల్ స్క్రీన్ల‌లో లోయ‌ర్ క్లాసుకు రూ. 100 (జీఎస్‌టీతో క‌లిపి), అప్ప‌ర్ క్లాసుకు రూ. 150 (జీఎస్‌టీతో క‌లిపి) వ‌ర‌కు పెంచుకోవ‌చ్చంది. అలాగే డిసెంబ‌ర్ 5 నుంచి 17 వ‌ర‌కు ఐదు షోల‌కు అనుమ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఏపీ ప్ర‌భుత్వానికి థ్యాంక్స్: అల్లు అర్జున్‌   
పుష్ప‌2 సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తినిచ్చిన ఏపీ ప్ర‌భుత్వానికి అల్లు అర్జున్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా థ్యాంక్స్ చెప్పారు. ఈ నిర్ణ‌యం తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌ ఎదుగుద‌ల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న నిబ‌ద్ధ‌త‌ను తెలియ‌జేస్తుంద‌ని అన్నారు. సినీ ప‌రిశ్ర‌మను ప్రోత్స‌హిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుకు స్పెష‌ల్ థ్యాంక్స్. ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి మ‌ద్ద‌తుగా నిలుస్తోన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సిన్సియ‌ర్ థ్యాంక్స్ అంటూ బ‌న్నీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.


More Telugu News