ఎన్నికలు వస్తే కేసీఆర్‌దే అధికారమని ఓ సర్వే ప్రతినిధి చెప్పారు: కేటీఆర్

  • 'నమ్మి నానబోస్తే' షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూకు హాజరైన కేటీఆర్
  • కాంగ్రెస్ పాలనపై ప్రజలకు మనసు విరిగిందని ఓ సర్వే ప్రతినిధి చెప్పాడని వెల్లడి
  • కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బాగా పోరాటం చేస్తోందని వ్యాఖ్యలు
ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు మనసు విరిగిందని, మళ్లీ ఎన్నికలు వస్తే కేసీఆర్‌దే అధికారమని ఓ సర్వే ప్రతినిధి చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 'నమ్మి నానబోస్తే' షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

ఈరోజు తన వద్దకు ఎన్నికల సర్వేకు సంబంధించిన ఓ ప్రతినిధి వచ్చారని, కాంగ్రెస్ ఏడాది పాలన గురించి చాలా చెప్పారన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో సదరు ప్రతినిధి తనకు వివరించారన్నారు.

సహజంగా ఏ ప్రభుత్వం మీద అయినా మూడు నాలుగేళ్ల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం ఏడాదిలోనే వచ్చినట్లు చెప్పాడని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాటం బాగా చేస్తోందని, దీనిని కొనసాగిస్తే తిరిగి కేసీఆర్‌కు అధికారం దక్కుతుందని ఆయన చెప్పారన్నారు.

తెలంగాణ భవన్ నిత్యం కళకళలాడుతుంటే... గాంధీ భవన్ మాత్రం బోసిపోతోందన్నారు. లగచర్ల ఘటనపై తమ లీగల్ సెల్ బృందం బాధితుల తరఫున పోరాటం చేస్తోందన్నారు. జైల్లో ఉన్న గిరిజన రైతులను తప్పకుండా విడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లగచర్ల అంశంపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ-ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

బకాయిలు ఇప్పించాలని మాజీ సర్పంచ్‌లు, తమ సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలని ఆశా వర్కర్లు తమను కోరుతున్నారన్నారు. ఈరోజు చాలామంది తెలంగాణ భవన్‌కు వచ్చి సమస్యలను విన్నవించుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. 

ఇక, 'నమ్మి నానబోస్తే' షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతూ... ఇది గుండెను తట్టే విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వంపై తప్పకుండా పోరాటం చేస్తామన్నారు. మనకు అధికారం మాత్రమే పోయిందని... పోరాట చేవ, యావ మాత్రం పోలేదన్నారు.


More Telugu News