అదానీ టీషర్ట్ రాహుల్ వేసుకుంటే మీకు పర్వాలేదు.. మేము వేసుకుంటే ఇబ్బంది ఏమిటి?: హరీశ్ రావు

  • అసెంబ్లీకి రేవంత్, అదానీ టీషర్టులు వేసుకుని వెళ్లిన బీఆర్ఎస్ నేతలు
  • అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ హరీశ్ రావు
అసెంబ్లీ సమావేశాలకు రేవంత్, అదానీ ఫొటోలు ఉన్న టీషర్టులను వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీషర్టులను తొలగించాలని వారికి పోలీసులు సూచించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదానీ టీషర్టులు ధరించి కాంగ్రెస్ నేతలు పార్లమెంటుకు వెళ్లారని... అదానీ అక్రమాలను నిరసిస్తూ వెళ్లారని చెప్పారు. ఢిల్లీలో మీ నాయకుడు రాహుల్ గాంధీ... అదానీ టీషర్ట్ వేసుకుని వెళ్తే మీకు పర్వాలేదు... ఇక్కడ మేము టీషర్టులు ధరించి వస్తే మీకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. 

రాహుల్ గాంధీకి ఒక నీతి, రేవంత్ రెడ్డికి మరో నీతి ఉంటుందా? అని హరీశ్ ప్రశ్నించారు. రేవంత్ తో అదానీకి ఉన్న అక్రమ సంబంధాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.


More Telugu News