కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలే వారికి న్యాయం చేశారు: కవిత

  • బీసీలకు రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిర్లక్ష్యం వహించాయని ఆరోపణ
  • రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయన్న కవిత
  • బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని రాజీవ్ గాంధీ అన్నారని ఆరోపణ
కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలే బీసీలకు న్యాయం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో ఆమె మాట్లాడుతూ... బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వహించాయని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయ‌న్నారు. తాను చెప్పింది తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాని సవాల్ చేశారు.

ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారని, ఇది బీసీలకు కాంగ్రెస్ చేసిన ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. మండల్ కమిషన్‌ను మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదని తెలిపారు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ తొక్కి పెట్టిందన్నారు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసిందన్నారు. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టిందన్నారు.

బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని రాజీవ్ గాంధీ వ్యాఖ్యానించారని ధ్వజమెత్తారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదని విమర్శించారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదన్నారు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసిందన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయన్నారు.

కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో చెప్పాలన్నారు. సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు... పులిబిడ్డ... మహిళా విద్యాకు ఎంతగానో కృషి చేశారన్నారు.


More Telugu News