కిలో టమాటా రూ.2... గిట్టుబాటు ధర లేక 4 ఎకరాల పంటకు నిప్పంటించిన రైతు

  • నాలుగు ఎకరాల్లో టమాటా వేసిన మెదక్ జిల్లా నవాబ్‌పేట రైతు
  • 25 కిలోల టమాటా బుట్ట ధర కేవలం రూ.50
  • కిలో రూ.2 పలుకుతున్న టమాటా ధర
  • రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన
తెలంగాణలో టమాటాకు గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో అయితే టమాటాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఓ రైతు తన పొలంలోని టమాటా పంటను తగులబెట్టేశాడు. మొన్నటి వరకు 25 కిలోలు కలిగిన టమాటా బుట్ట ధర రూ.600 నుంచి 1,200 వరకు పలిగిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే బుట్టకు కనీసం రూ.100 కూడా రావడం లేదు.

మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలం నవాబ్‌పేటకు చెందిన రైతు రవి గౌడ్ నాలుగు ఎకరాల్లో టమాటా సాగు చేశాడు.  పంటను మార్కెట్‌కు తీసుకు వెళితే 25 కిలోల బుట్ట రూ.50 పలుకుతోంది. అంటే కిలో రూ.2 మాత్రమే పలుకుతోంది. దీంతో అతను తన నాలుగు ఎకరాల్లోని టమాటా పంటకు నిప్పు పెట్టాడు. నవాబ్‌పేట గ్రామంలో ఎక్కువ మంది రైతులు టమాటాను సాగు చేస్తుంటారు. ఈసారి దాదాపు 70 ఎకరాల్లో టమాటా పండించారు.

కూలీలతో టమాటాను తెంపించి... మార్కెట్‌కు తీసుకు వెళితే అయ్యే రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని రవి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశాడు. టమాటాను నిల్వ చేసుకోవడానికి కూడా అవకాశం లేదని చెబుతున్నాడు. గిట్టుబాటు ధర లేక... నాలుగు ఎకరాల్లోని మూడు టన్నులకు పైగా పంటను పూర్తిగా తొలగించినట్లు చెప్పాడు.


More Telugu News