రెవెన్యూ సదస్సుల్లో 32 రకాల ఫిర్యాదులు వస్తున్నాయి: మంత్రి అనగాని

  • కలెక్టర్లు, జేసీలతో ప్రాంతీయ రెవెన్యూ సదస్సులు
  • లక్షకు పైగా అర్జీలు ఆర్వోఆర్ అంశాలపై ఉన్నాయన్న మంత్రి అనగాని
  • రీ-సర్వే వివాదాలపై 7 వేల అర్జీలు వచ్చాయని వెల్లడి
  • జనవరి 20 నుంచి మళ్లీ రీ-సర్వే మొదలుపెడతామని స్పష్టీకరణ
రాష్ట్రంలో కలెక్టర్లు, జేసీలతో ప్రాంతీయ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఏపీ రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రధానంగా 32 రకాల ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఒక లక్షకు పైగా అర్జీలు ఆర్వోఆర్ అంశాలపైనే ఉన్నాయని వివరించారు. రీ-సర్వే వివాదాలపై 7 వేల అర్జీలు వచ్చాయని, రెవెన్యూ సదస్సుల్లోనే అర్జీల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అనగాని చెప్పారు. 

రెవెన్యూ సదస్సులు జనవరి 8న ముగుస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో సంక్రాంతి తర్వాత కూడా మరో ఐదు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. 

జనవరి 20 నుంచి మళ్లీ రీ-సర్వే ప్రక్రియ మొదలుపెడతామని చెప్పారు. రోజుకు 20 ఎకరాల చొప్పున బ్లాకుల వారీగా రీ-సర్వే చేపడతామని వివరించారు. మండలానికి ఓ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని రీ-సర్వే జరుపుతామని పేర్కొన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ లో పెట్టారని తెలిపారు. 4 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసినట్టు గుర్తించామని, ఇందులో 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారని మంత్రి అనగాని వెల్లడించారు. 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించామని వివరించారు. 

ఇక, భూముల రిజిస్ట్రేషన్ విలువ సహేతుకంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. గ్రోత్ కారిడార్లలో కొన్ని చోట్ల భూముల విలువలో పెరుగుదల, కొన్ని చోట్ల తగ్గుదల ఉంటుందని... భూమి విలువకు తగిన విధంగా రిజిస్ట్రేషన్ విలువ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


More Telugu News