విజయవాడలో హైందవ శంఖారావం సభ... డిక్లరేషన్ ప్రకటించిన వీహెచ్ పీ

  • వీహెచ్ పీ ఆధ్వర్యంలో కేసరపల్లి వద్ద భారీ ఎత్తున హిందూ సభ
  • లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు
  • హాజరైన చినజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి తదితరులు
హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల విశిష్టతను కాపాడడం, ముఖ్యంగా ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించడం తదితర అంశాలే అజెండాగా నేడు విజయవాడ కేసరపల్లిలో హైందవ శంఖారావం సభ నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాదిగా తరలివచ్చారు. 

చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి తదితర ఆధ్యాత్మికవేత్తలు ఈ సభకు హాజరై కీలక ప్రసంగాలు చేశారు. కాగా, ఈ హైందవ శంఖారావం సభలో వీహెచ్ పీ కీలక డిక్లరేషన్ ను ప్రకటించింది. చినజీయర్ స్వామి హైందవ శంఖారావం డిక్లరేషన్ ను అందరితో ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ డిక్లరేషన్ లోని అంశాలు...

  • ఆలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలి
  • హిందూ దేవాలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులు అరికట్టాలి
  • చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • వినాయకచవితి, దసరా వంటి ముఖ్య పండుగల సమయంలో ఆంక్షలు విధించడం తగదు
  • దేవాలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తిశ్రద్ధలతో చేయాలి
  • హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి
  • హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్టు బోర్డుల్లో సభ్యులుగా నియమించాలి
  • ట్రస్టు బోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు స్థానం కల్పించాలి
  • హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి
  • ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా ఆలయాలకు అప్పగించాలి
  • దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలి
  • దేవస్థానాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు



More Telugu News