వాట్సాప్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్‌.. ఇక‌పై స్టేట‌స్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకోవ‌చ్చు!

  • ఇన్‌స్టాలో ఉన్న‌ట్లే స్టేట‌స్ ఫొటోలు, వీడియోల‌కు మ్యూజిక్ ఫీచ‌ర్‌
  • అయితే, ఇందులో సెలెక్టెడ్ ట్రాక్స్ మాత్ర‌మే వాడుకునే వెసులుబాటు
  • ఇష్ట‌మైన పాట‌ల‌ను యాడ్‌ చేయ‌డానికి వీలుప‌డ‌ని వైనం
ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న‌ యూజర్లకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను అందించ‌డంలో ముందు ఉంటుంది. తాజాగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై వాట్సాప్ యూజర్లు... తమ స్టేట‌స్‌కు మ్యూజిక్‌ను యాడ్ చేసుకోవచ్చు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న‌ట్లే ఇందులోనూ స్టేట‌స్ ఫొటోలు, వీడియోల‌కు మ్యూజిక్ యాడ్ చేసుకోవ‌చ్చు. అయితే, ఇందులో సెలెక్టెడ్ ట్రాక్స్ మాత్ర‌మే వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఇష్ట‌మైన పాట‌ల‌ను యాడ్‌ చేయ‌డానికి వీలుప‌డ‌దు.  

ఈ ఫీచర్‌ను ప్రకటిస్తూ వాట్సాప్ శుక్ర‌వారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. “వాట్సాప్ స్టేటస్ ఎల్లప్పుడూ జీవిత క్షణాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఒక మార్గం. ఇప్పుడు, మీరు మీ స్టేటస్ అప్‌డేట్‌లకు సంగీతాన్ని జోడించడం ద్వారా సరిగ్గా అదే చేయవచ్చు” అని పేర్కొంది.

వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ యాడ్ చేయ‌డం ఎలాగంటే..
  • ముందుగా వాట్సాప్ ఒపెన్ చేసి... యాడ్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • ఆ తర్వాత గ్యాలరీ నుంచి... లేదంటే, అప్పటికప్పుడు ఫొటో దిగి.. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి
  • క్రాప్‌, స్టిక్క‌ర్స్, ఎడిట్ ఆప్ష‌న్లు సాధార‌ణంగా స్క్రీన్‌పై క‌నిపిస్తాయి
  • వాటిముందే మ్యూజిక్ ఐకాన్ క‌నిపిస్తుంది
  • ఆ మ్యూజిక్ ఐకాన్ మీద ట్యాప్ చేసి... మ్యూజిక్ లైబ్రరీని ఓపెన్ చేసుకోవాలి
  • దాని నుంచి మీకు నచ్చిన పాటను సెలక్ట్ చేసుకోచ్చు

అయితే, ఫొటోకు 15 సెక‌న్ల‌ వరకు మ్యూజిక్ యాడ్ చేసుకోవ‌చ్చు. అదే వీడియోకైతే 60 సెక‌న్ల‌ వరకు పాట ప్లే అవుతుంది. అంతేగాక మీరు ఎంచుకున్న‌ ట్రాక్‌ ఎక్క‌డి నుంచి ప్లే కావాల‌ని కోరుకుంటున్నారో అక్క‌డి నుంచి అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.  


More Telugu News