తిరుమ‌లలో గ‌దుల బుకింగ్ సింపుల్‌.. ఎలాగో ఈ వీడియో చూడండి!

  • తిరుమలలో గదులు దొరకక భక్తులు ఇక్కట్లు
  • తిరుమలలో భక్తులు సులభంగా గదులను పొందేందుకు కీలక సూచనలు చేసిన టీటీడీ 
  • తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సీఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించి సులభంగా గదులు పొందాలని సూచన 
  • ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన టీటీడీ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బస చేయడానికి గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

ఈ సమస్య నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు కీలక సూచన చేసింది. తిరుమలలో గదుల కోసం ఎలా ప్రయత్నించాలి అనే విషయాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.

ఈ వీడియో ప్ర‌కారం... తిరుమలకు వచ్చిన భక్తులు గదుల కోసం తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీసు (సీఆర్ఓ)కు వెళ్లి... అక్కడ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ద‌ర్శ‌నం టికెట్, మొబైల్ నంబ‌ర్ త‌దిత‌ర‌ వివ‌రాల‌తో ఒక ద‌ర‌ఖాస్తు ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత‌ కార్యాల‌య సిబ్బందికి దాన్ని స‌మ‌ర్పిస్తే... వారు ఈ రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియను పూర్తి చేస్తారు. 

30 నిమిషాల‌ త‌ర్వాత మ‌నం ఏ మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేష‌న్ చేసుకున్నామో.. ఆ నంబ‌ర్‌కు మ‌న‌కు కేటాయించిన‌ గది వివరాలతో కూడిన ఒక సందేశం వ‌స్తుంది. ఆ వివ‌రాల‌తో మ‌న‌కు కేటాయించిన గ‌దికి వెళ్లి బ‌స చేసే వెసులుబాటు ఉంటుంది. ఇక‌, సీఆర్ఓ కార్యాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గ‌దుల కేటాయింపు అనేది  తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 


More Telugu News