గాల్లోనే విమానం ఇంజిన్‌లో మంటలు.. భ‌యాన‌క దృశ్యాలు!

  • అమెరికాలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక సమస్య
  • టేకాఫ్ అయ్యాక ఇంజిన్‌లో మంటలు, పొగలు రావడంతో కలకలం
  • పైలట్ల సమయస్ఫూర్తితో లాస్ వేగాస్ ఎయిర్‌పోర్టులో సేఫ్ ల్యాండింగ్
  • విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితం
  • ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభం
అమెరికాలో పెను విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:11 గంటలకు లాస్‌వేగాస్‌లోని మెక్‌కారన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు బయలుదేరింది. విమానం గాల్లోకి లేచిన కొద్ది నిమిషాలకే దాని ఇంజిన్లలో ఒకదాని నుంచి మంటలు, దట్టమైన పొగలు రావడం మొదలైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు.

పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్లకు సమాచారం అందించారు. పైలట్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని వెనక్కి, లాస్‌వేగాస్ విమానాశ్రయానికి మళ్లించారు. ఉదయం 8:20 గంటలకు విమానం సురక్షితంగా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై ఎఫ్‌ఏఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అయితే, విమానం ల్యాండ్ అయిన తర్వాత సాంకేతిక నిపుణులు తనిఖీలు నిర్వహించగా, ఇంజిన్ నుంచి మంటలు వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎయిర్‌లైన్ మెకానిక్స్ చెప్పడం గమనార్హం. ప్రయాణికులు మాత్రం మంటలు చూశామని చెబుతుండటంతో ఘటనకు దారితీసిన కచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.


More Telugu News