ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

  • హైకోర్టులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణ
  • మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు
  • కౌంటర్ దాఖలుకు సీఐడీకి హైకోర్టు ఆదేశాలు
  • తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నిన్న హైకోర్టు విచారణ జరిపింది. మోహిత్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సి. నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. కఠిన చర్యలు తీసుకోకుండా సీఐడీ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు.

ముందస్తు బెయిల్ కోసం మోహిత్ రెడ్డి విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ముందస్తు బెయిల్ కోసం విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, మరోవైపు క్వాష్ పిటిషన్‌లో కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ కోర్టుకే వెళ్లి వాదనలు అక్కడే చెప్పుకోవాలని సూచించింది.

మోహిత్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.

కాగా, ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని 39వ నిందితుడుగా పేర్కొంటూ సీఐడీ ఇటీవల విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే సీఐడీ విచారణకు మోహిత్ రెడ్డి గైర్హాజరైన విషయం తెలిసిందే. 


More Telugu News