పాప్ సంగీత ప్రపంచానికి రాణిగా పేరుగాంచిన మడోన్నా.. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సంగీత ప్రియులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. 67 ఏళ్ల ఈ సింగర్, తన 15వ స్టూడియో ఆల్బమ్‌కు సంబంధించిన వివరాలను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. 2019లో వచ్చిన 'మేడమ్ ఎక్స్' తర్వాత మడోన్నా నుంచి వస్తున్న ఆల్బమ్ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ఆల్బమ్‌ను మడోన్నా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. 2023లో సెప్సిస్‌తో ప్రాణాపాయం నుంచి బయటపడగా, ఆ తర్వాత ఏడాది తన సోదరుడు క్రిస్టోఫర్‌ను కోల్పోయారు. ఈ అనుభవాలన్నీ ఆమె కొత్త ఆల్బమ్‌లో ప్రతిబింబిస్తాయని తెలుస్తోంది.

2005లో తనకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన 'కన్ఫెషన్స్ ఆన్ ఏ డ్యాన్స్ ఫ్లోర్' ఆల్బమ్ ప్రొడ్యూసర్ స్టువర్ట్ ప్రైస్‌తో మడోన్నా మళ్లీ పనిచేస్తున్నారు. ఇది ఆల్బమ్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. మరోవైపు, ఈ ఆల్బమ్‌లో పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్‌తో కలిసి పనిచేసేందుకు మడోన్నా ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సుమారు 23 ఏళ్ల క్రితం 'మీ ఎగైనెస్ట్ ది మ్యూజిక్' పాటతో వీరిద్దరూ సంచలనం సృష్టించారు. బ్రిట్నీ ఒక అద్భుతమైన కళాకారిణి అని, ఆమెతో కలిసి పనిచేయడానికి మడోన్నా ఆసక్తిగా ఉన్నారని బ్రిట్నీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.