అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వంపైనా, నాటో మిత్రదేశాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎనిమిది నెలల్లో ఇరాన్ ప్రభుత్వం కనీసం 75,000 మంది నిరసనకారులను చంపిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో, ఇరాన్‌తో వివాదం తలెత్తినప్పుడు నాటో దేశాల నుంచి తాము కోరిన సహాయం కేవలం ఒక పరీక్ష మాత్రమేనని వెల్లడించారు.

వచ్చే నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా కాన్సాస్‌లో జరిగిన ఒక ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. గత ఎనిమిది నెలల్లో ఇరాన్ కనీసం 75,000 మంది నిరసనకారులను హత్య చేసిందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్‌లో నిరసనలు ఎందుకు కొనసాగడం లేదని కొందరు అడుగుతున్నారని... వీధి చివర మెషిన్ గన్‌లతో కాల్చి చంపుతుంటే నిరసన చేయడం కష్టం అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక నాటో విషయమై మాట్లాడుతూ... "ఇరాన్‌తో యుద్ధం సమయంలో మేము సహాయం అడిగాం. నిజానికి మాకు ఆ సహాయం అవసరం లేదు. కానీ నేను వారిని పరీక్షించదలిచాను" అని అన్నారు. అమెరికా నాటో కోసం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, క్లిష్ట సమయంలో మిత్రదేశాల నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని, వారు సహాయం చేయడానికి ముందుకు రాలేదని ట్రంప్ స్పష్టం చేశారు.