ప్రముఖ కశ్మీరీ క్రికెటర్ జహంగీర్ లోన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఓ అభిమానిపై చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఓటమిని తట్టుకోలేక క్రీడాకారుడు ఈ విధంగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. రెడ్ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్‌) టోర్నమెంట్‌లో భాగంగా అథ్వాస్ ఇండియా XI, రాయల్ గుడ్‌విల్ సీసీ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అథ్వాస్ ఇండియా XI జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే, గెలిచిన జట్టు మద్దతుదారులు సంబరాలు చేసుకునేందుకు మైదానంలోకి ప్రవేశించడంతో గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో ఓటమి పాలైన రాయల్ గుడ్‌విల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జహంగీర్ లోన్, ఓ అభిమానితో ఘర్షణకు దిగాడు. అతడిని నెట్టివేస్తూ, పంచ్‌లు ఇస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి.

ఈ ఘటనపై జహంగీర్ ఓ స్థానిక మీడియా సంస్థతో మాట్లాడుతూ వివరణ ఇచ్చాడు. ఓటమి తర్వాత తమ జట్టు పెవిలియన్‌కు వెళుతుండ‌గా, ప్రత్యర్థి జట్టు మద్దతుదారులు మైదానంలోకి వచ్చి తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ముఖ్యంగా తన తల్లిని ఉద్దేశించి తీవ్రమైన నిందలు వేశారని, అందుకే సహనం కోల్పోయానని చెప్పాడు. ఆ సమయంలో కోపాన్ని అదుపు చేసుకోలేకపోయానని అన్నాడు. అనంతరం "నా కుటుంబం! నా గర్వకారణం" అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఈ ఘటనపై క్రీడాభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది జహంగీర్ ప్రవర్తనను ఖండిస్తూ, అతనిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, మరికొందరు నెటిజన్లు మాత్రం అతడిని రెచ్చగొట్టడం వల్లే ఇలా జరిగిందని వాదిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, విచారణ జరుపుతున్నట్లు సమాచారం.