ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, తన పాపులర్ 125సీసీ కమ్యూటర్ బైక్ 'రైడర్‌'ను అప్‌డేట్ చేసింది. 2026 మోడల్ టీవీఎస్ రైడర్ 125ను కొత్త రంగులు, అధునాతన ఫీచర్లతో భారత మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్టీ లుక్‌తో యువతను ఆకట్టుకుంటున్న ఈ బైక్‌లో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ కొత్త అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణగా 'నైట్రో గ్రీన్' కలర్ ఆప్షన్ నిలుస్తోంది. ఈ రంగు బైక్ హెడ్‌ల్యాంప్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తోంది. ముందు వీల్ గ్రీన్ కలర్‌లో, వెనుక వీల్ బ్లాక్ కలర్‌లో ఉండటం మరో విశేషం. అయితే ఈ కొత్త కలర్ కేవలం టాప్-స్పెక్ వేరియంట్లయిన TFT DD, SXC DDలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు మెటాలిక్ బ్లూ, స్ట్రైకింగ్ రెడ్ రంగులు కూడా కొనసాగుతాయి.

ఫీచర్ల విషయానికొస్తే, టాప్-ఎండ్ TFT DD వేరియంట్‌లో కీలక మార్పు చేశారు. పాత ఎల్‌సీడీ డిస్‌ప్లే స్థానంలో కొత్తగా పూర్తి-కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్, వెదర్ అప్‌డేట్స్, లైవ్ స్పోర్ట్స్ స్కోర్లు వంటి అనేక కనెక్టెడ్ ఫీచర్లను పొందవచ్చు. మిగతా వేరియంట్లలో ఎల్‌సీడీ కన్సోల్ కొనసాగుతుంది.

బైక్ ఇంజిన్‌లో మాత్రం టీవీఎస్ ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో మాదిరిగానే 124.8 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 11.38 హార్స్‌పవర్ శక్తిని, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ధరల విషయానికొస్తే, 2026 టీవీఎస్ రైడర్ 125 బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 82,860 నుంచి ప్రారంభం కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 98,550గా ఉంది.