ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రతిపాదించిన ముఖాముఖి చర్చలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి భేటీకి ఎలాంటి అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరమ్‌లో శుక్రవారం ప్రసంగిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

శాంతి చర్చల నిమిత్తం స్విట్జర్లాండ్ లేదా టర్కీ వంటి తటస్థ దేశాల్లో సమావేశమవుదామని, అంతర్జాతీయ పర్యవేక్షణలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని జెలెన్‌స్కీ ఒక రోజు ముందే బహిరంగ లేఖ ద్వారా పుతిన్‌ను కోరారు. ఈ ప్రతిపాదనపై పుతిన్ స్పందిస్తూ.. "ప్రస్తుత తరుణంలో ఇటువంటి సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మా సైనిక చర్యలను అడ్డుకోవడమే ఉక్రెయిన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది" అని పేర్కొన్నారు. ఇరువురు నేతలు భేటీ కావడానికి ముందే నిపుణులు సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

జెలెన్‌స్కీ రాసిన లేఖను తాను పరిశీలించానని, అందులో కొన్ని "అభ్యంతరకర అంశాలు" ఉన్నాయని పుతిన్ ఆరోపించారు. ఈ సమావేశాన్ని సఫలం చేయడం కంటే, విఫలం చేయాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లుగా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రష్యా నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని పుతిన్ పునరుద్ఘాటించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో, జెలెన్‌స్కీ అధ్యక్ష పదవి చట్టబద్ధతపై క్రెమ్లిన్ గతంలోనూ పలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం విదితమే.